వనదుర్గా మహావిద్యా పంచశతి – పరిచయము

/
/
/
148 Views

శాక్తోపాసనలో నాకు నచ్చిన ఉపాసన “శ్రీ వనదుర్గా మహావిద్యా పంచశతి” పారాయణ. ఈ ఉపాసన 500 మంత్రముల సమాహారము. శాక్తోపాసనలో అత్యంత ప్రాచుర్యము పొందిన ఉపాసనలు చండీసప్తశతీ, మరియు ఆధునిక కాలములో సామూహిక ప్రత్యంగిరా హోమములు. కాని వనదుర్గా మహావిద్య అంత ప్రాచుర్యము పోందివుండలేదు. బహుశ  ఈ విద్య పూర్తిగా మంత్రగర్భితము అగుటవలనో లేక ఈ విద్యా పారాయణాధికారము కేవలము శ్రీవిద్యా పూర్ణదీక్షాభిషిక్తులకు ఇచ్చుటవలనో అయివుండవచ్చు.

ఈ ఉపాసనా విశేషము ఏమిటనగా ఫలశ్రుతి మంత్రగర్భితమై పారాయణా పాఠానుక్రమమున ఇమిడి వుంటుంది.

ఈ మహావిద్య రుద్రయామలాంతర్గత కల్పకౌస్తుభం నుండి ఉద్ధరింపబడినట్లుగా ప్రాచుర్యంలో ఉన్నది. మా నాన్నగారు ఆచార్య వెంకట గోపాల కృష్ణ మూర్తి గారు ప్రస్తుతము లభ్యతలో ఉన్న రుద్రయామల గ్రంధమును తెనిగీకరించుట జరిగినది. రుద్రయామలము పూర్తిగా షట్చక్రముల గూర్చి శివుని ప్రశ్నలకు పార్వతి సమాధాన రూపములో పొందుపరుచుట జరిగినది. కానీ వనదుర్గా మహావిద్య పార్వతి ప్రశ్నకు శివుడు సమాధాన రూపములో వుంటుంది. ఈ విషయమై మా నాన్నగారు శ్రీకవుతా నరసింహశాస్త్రి గారిని (శ్రీ మహాదేవా నిర్మితా మహా విద్యా – సంకలనకర్త) ప్రశ్నించగా, తనకు కూడా ఈ విద్య యొక్క మూలముపై అవగాహన లేదని, రుద్రయామలములో ఉన్నట్లుగా ప్రాచుర్యములో ఉన్నట్లుగా తాను కూడా విశ్వసించినట్లుగా చెప్పినారు.

శ్రీ వనదుర్గా మహావిద్య మూలము ఎచ్చట ఉన్నపటికీ, ఈ విద్య అద్భుతమైన ఫలితములను ఇచ్చు మహా సాధనా మార్గము.

శ్రీ వనదుర్గా మహావిద్య యందు ఎన్నో రహస్యములు దాగి ఉన్నవి.

  1. చండీసప్తశతి వలె వనదుర్గా మహావిద్య ప్రాచుర్యము ఎందుకు పొందలేదు?
  2. ఈ విద్యలోని మంత్రగర్భితమైన రహస్యాలు ఏమిటి?
  3. ఈ కాలములో ప్రచురణలో ఉన్న పాఠములు ఎన్ని?
  4. నేను ఉపాసించి ఫలితములు పొందుటకు కారణము ఏమై ఉండవచ్చు?

వీటి అన్నిటికి సమాధానములు ఈ మహావిద్యలోనే ఉన్నవి. అవి నా రాబోవు పోస్టుల ద్వారా ప్రచురించెదను.

ఇది నా అవగాహన….

5 Comments

  1. ఆది శంకరులు ఉభయ భారతీ దేవిని వనదుర్గా మంత్రాలతో కట్టడి చేసి శృంగేరి పీఠంలో ఉండవలసిందిగా కోరారని చాగంటి వారు చెప్పగా విన్నాను. ఆ వనదుర్గామ్మ ఉపాసన శంకరులవారు చేసియున్నారని భావించొచ్చా?

    • నాకున్న విషయ పరిజ్ఞానములో ఆది శంకరులు వనదుర్గా ఉపాసన చేసినట్లు వినిగాని చదివిగని ఉండలేదు. ఆంధ్రదేశమున ఈ విద్యను ప్రాచుర్యములోకి తెచ్చింది శ్రీ శృంగేరీ శ్రీ విరూపాక్ష శ్రీ పీఠాధిపతులు జగద్గురు శ్రీ కల్యానంద భారతీ స్వామి వారు. తమిళనాట కూడా ఈవిద్య ప్రాచుర్యములో ఉండి ఉండవచ్చు, ఎందుకనగా అచ్చట వనదుర్గా దేవాలయములు ఉన్నవి. ఉత్తరభారతము నందు కూడా ఈ విద్య ఉండివున్నది. నా వద్ద ఉత్తరభారతమునకు చెందిన రెండు ప్రతులు కలవు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

It is main inner container footer text